రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన అప్డేట్. 2027 జనవరి 1 నుంచి భారతీయ రైల్వేలోని 18 రైళ్ల వర్గీకరణ, నంబర్లలో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం సూపర్‌ఫాస్ట్ కేటగిరీలో నడుస్తున్న ఈ రైళ్లను సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చనున్నారు. దీంతో ప్రయాణికులకు టికెట్ ధరలో కొంత ఊరట లభించనుంది. ముఖ్యంగా సూపర్‌ఫాస్ట్ సర్ఛార్జ్ తొలగిపోనుంది.
18 రైళ్లకు సూపర్‌ఫాస్ట్ హోదా ఎందుకు తొలగిస్తున్నారు?
రైల్వే నిబంధనల ప్రకారం బ్రాడ్‌గేజ్ రైలు సూపర్‌ఫాస్ట్ హోదా పొందాలంటే మొత్తం ప్రయాణంలో గంటకు కనీసం 55 కిలోమీటర్ల సగటు వేగాన్ని కలిగి ఉండాలి. అయితే నార్తర్న్ రైల్వే పరిధిలోని 18 రైళ్లు ఈ ప్రమాణాలను అందుకోవడం లేదని సమీక్షలో తేలింది. దీంతో వాటిని సాధారణ ఎక్స్‌ప్రెస్ కేటగిరీలోకి మార్చాలని నిర్ణయించారు.
రైల్వే మార్గాల్లో రద్దీ, అదనపు స్టాపులు, స్టేషన్లలో ఎక్కువసేపు నిలవడం వంటి కారణాలు రైళ్ల సగటు వేగంపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలోనే రైళ్ల వర్గీకరణలో మార్పులు చేస్తున్నారు.
కొత్త నంబర్లు పొందనున్న 18 రైళ్లు
2027 జనవరి 1 నుంచి తనక్‌పూర్–ఢిల్లీ రైలు నంబర్ 12035 స్థానంలో 15317, తిరుగు ప్రయాణంలో 12036 స్థానంలో 15318 అమల్లోకి వస్తాయి. డెహ్రాడూన్–కాఠ్గోదాం రైలు 12091 నుంచి 15315కు, కాఠ్గోదాం–డెహ్రాడూన్ రైలు 12092 నుంచి 15316కు మారనున్నాయి.
మొరాదాబాద్–రామ్‌నగర్ మార్గంలోని 25013, 25035 నంబర్ల రైళ్లు వరుసగా 15313, 15335 నంబర్లతో నడుస్తాయి. రామ్‌నగర్–మొరాదాబాద్ మార్గంలోని 25014, 25036 రైళ్లు వరుసగా 15314, 15336 నంబర్లకు మారనున్నాయి.
ఇస్లాంపూర్–న్యూఢిల్లీ రైలు 20801 నుంచి 18633కు, న్యూఢిల్లీ–ఇస్లాంపూర్ రైలు 20802 నుంచి 18634కు మారుతాయి. దర్భంగా–జలంధర్ సిటీ రైలు 22551 నుంచి 15541కు, తిరుగు ప్రయాణ రైలు 22552 నుంచి 15542కు మారనున్నాయి.
పాట్నీపుత్ర–చండీగఢ్ రైలు 22355 నుంచి 13255కు, చండీగఢ్–పాట్నీపుత్ర రైలు 22356 నుంచి 13256కు మారుతాయి. ముజఫర్‌పూర్–ఆనంద్ విహార్ రైలు 12557 నుంచి 15577కు, తిరుగు ప్రయాణ రైలు 12558 నుంచి 15578కు మారనున్నాయి.
అలాగే రాజ్‌గిర్–న్యూఢిల్లీ రైలు 12391 నుంచి 13291కు, న్యూఢిల్లీ–రాజ్‌గిర్ రైలు 12392 నుంచి 13292కు మారనున్నాయి.
ప్రయాణికులకు ఎంత డబ్బు ఆదా అవుతుంది?
సూపర్‌ఫాస్ట్ రైళ్లలో సాధారణ టికెట్ ధరతో పాటు అదనంగా సూపర్‌ఫాస్ట్ సర్ఛార్జ్ వసూలు చేస్తారు. ఈ 18 రైళ్లు సాధారణ ఎక్స్‌ప్రెస్ కేటగిరీలోకి మారడంతో ఆ అదనపు ఛార్జీ తొలగిపోనుంది.
స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు సుమారు రూ.30, ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్, ఏసీ చైర్ కార్ వంటి తరగతుల్లో ప్రయాణించే వారికి సుమారు రూ.45 వరకు ఆదా కావచ్చు. ఫస్ట్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణికులకు సుమారు రూ.75 వరకు తగ్గే అవకాశం ఉంది. ఇవి సూపర్‌ఫాస్ట్ సర్ఛార్జ్ తొలగింపు వల్ల కలిగే తగ్గింపులు మాత్రమే. ప్రాథమిక టికెట్ ధరలో మార్పు కాదు.
ప్రయాణికులు తప్పనిసరిగా గమనించాల్సిన విషయం
జనవరి 2027 నుంచి ఈ రైళ్లలో ప్రయాణించేవారు టికెట్లు బుక్ చేసుకునే ముందు కొత్త రైలు నంబర్లను తనిఖీ చేసుకోవాలి. పాత నంబర్లతో సేవ్ చేసుకున్న ప్రయాణ వివరాలను కూడా మరోసారి పరిశీలించుకోవడం మంచిది.
రైళ్ల నంబర్లు, ప్రయాణ సమయాలు, స్టాపుల తాజా వివరాల కోసం NTES లేదా భారతీయ రైల్వే అధికారిక రిజర్వేషన్ వెబ్‌సైట్‌ను పరిశీలించాలి. రైల్వేలో మార్పులు అమల్లోకి వచ్చే తేదీని కూడా గమనించాలి.