క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్! ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ 2027 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. ఈ టోర్నీకి బంగ్లాదేశ్, నేపాల్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. 41 మ్యాచ్‌లలో యువ మహిళా క్రికెటర్లు ప్రపంచ విజేతగా నిలిచేందుకు పోటీపడనున్నారు.
జనవరి 21న టోర్నీ ప్రారంభం
2027 మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ మూడో ఎడిషన్ జనవరి 21న ప్రారంభం కానుంది. గ్రూప్ దశ మ్యాచ్‌లు జనవరి 26 వరకు జరుగుతాయి. అనంతరం సూపర్ సిక్స్ దశ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్, నేపాల్‌లోని నాలుగు వేదికలపై మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
- చట్టోగ్రామ్‌లోని బీర్ శ్రేష్ఠ షహీద్ ఫ్లైట్ లెఫ్టినెంట్ మతియుర్ రెహమాన్ క్రికెట్ స్టేడియం
- సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
- ఖాట్మండులోని TU అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
- అప్పర్ ముల్పానీ అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్
భారత్ తొలి మ్యాచ్ ఎవరితోంటే?
రెండుసార్లు వరుసగా ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు, ఈసారి కూడా టైటిల్‌ను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. భారత్ తన తొలి మ్యాచ్‌లో జనవరి 22న వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ నేపాల్‌లోని ఖాట్మండులో జరుగుతుంది.
భారత్ గ్రూప్-Aలో ఐర్లాండ్, వెస్టిండీస్, ఆతిథ్య నేపాల్ జట్లతో కలిసి ఉంది. గ్రూప్ దశలో భారత జట్టు ఆడే మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
- జనవరి 22: భారత్ వర్సెస్ వెస్టిండీస్
- జనవరి 24: నేపాల్ వర్సెస్ భారత్
- జనవరి 26: భారత్ వర్సెస్ ఐర్లాండ్
ఈ మూడు మ్యాచ్‌లు ఖాట్మండులోని TU అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి.
నాలుగు గ్రూపుల్లో 16 జట్లు
టోర్నీలో పాల్గొనే జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్-A: భారత్, ఐర్లాండ్, వెస్టిండీస్, నేపాల్
గ్రూప్-B: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, సమోవా
గ్రూప్-C: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నైజీరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)
గ్రూప్-D: ఇంగ్లండ్, శ్రీలంక, అమెరికా, స్కాట్లాండ్
ఈ గ్రూపుల్లో ప్రతి జట్టు తన ప్రత్యర్థులతో పోటీపడి తదుపరి దశకు అర్హత సాధించేందుకు ప్రయత్నిస్తుంది.
సెమీఫైనల్స్, ఫైనల్ ఎప్పుడంటే?
జనవరి 26తో గ్రూప్ దశ ముగుస్తుంది. అర్హత సాధించిన జట్లు సూపర్ సిక్స్ దశలో తలపడతాయి. అక్కడి నుంచి అగ్రస్థానంలో నిలిచే జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి.
- ఫిబ్రవరి 4: సెమీఫైనల్స్
- ఫిబ్రవరి 5: సెమీఫైనల్స్‌కు రిజర్వ్ డే
- ఫిబ్రవరి 6: ఫైనల్
- ఫిబ్రవరి 7: ఫైనల్‌కు రిజర్వ్ డే
సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు బంగ్లాదేశ్‌లోని చట్టోగ్రామ్ వేదికగా జరగనున్నాయి.
హ్యాట్రిక్ టైటిల్‌పై భారత్ కన్ను
ఇప్పటివరకు జరిగిన రెండు అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లలోనూ భారత జట్టే విజేతగా నిలిచింది. 2023లో ఇంగ్లండ్‌ను ఓడించి తొలి టైటిల్ సాధించిన భారత్, 2025లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఇప్పుడు 2027లోనూ టైటిల్ గెలిస్తే భారత్ వరుసగా మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఘనత సాధిస్తుంది. అందుకే ఈ టోర్నీ భారత యువ మహిళా క్రికెటర్లకు కీలకంగా మారనుంది. మరి ఈసారి కూడా భారత జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.